రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కీలక నిర్ణయం తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటు (Repo Rate)ను 25 బేస్ పాయింట్లు తగ్గించేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజా రెపో రేటు 6.25%గా నిర్ణయించబడింది. ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఆర్బీఐ రెపోరేటును తగ్గించడం ఆసక్తికరంగా మారింది.
లోన్లపై తక్కువ వడ్డీ రేట్లు?
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ ప్రజలకు, వ్యాపార సంస్థలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించవచ్చు. రెపో రేటు తగ్గితే, బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో ఆర్బీఐ నుంచి రుణాలు పొందగలవు. దీని ప్రభావంగా, గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇంకా సవాళ్లతోనే కొనసాగుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ తాజా రెపోరేట్ తగ్గింపు దేశీయ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయా అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.