రాయలసీమ లిఫ్ట్ వివాదం.. ‘టీడీపీ మీడియా’ గొంతులో పచ్చి వెలక్కాయ

రాయలసీమ లిఫ్ట్ వివాదం.. 'టీడీపీ మీడియా' గొంతులో పచ్చి వెలక్కాయ

రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation Scheme) అంశం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అనుకూల మీడియాను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy), మరోవైపు తమకు అత్యంత ఆప్తుడైన సీఎం చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu). రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌ను తన విజ్ఞప్తితోనే చంద్రబాబు ఆపేశారని రేవంత్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించడంతో, టీడీపీతో పాటు ఆ పార్టీ అనుకూల‌ మీడియా కూడా ఏం చేయాలో అర్థం కాక అల్లాడుతోంది. రేవంత్‌ను విమర్శించే ధైర్యం లేక, చంద్రబాబును సమర్థించుకునే వీలు లేక ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ అధికారికంగా ఒక్క మాట కూడా అనలేకపోయింది. కూటమిలోని జనసేన (Jana Sena Party), బీజేపీ(BJP)లు కూడా మౌనమే పాటిస్తున్నాయి. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు కూడా మూడు రోజులు గడిచినా రేవంత్ వ్యాఖ్యలను నేరుగా ఖండించలేదు. దీంతో నష్టం కొంతైనా తగ్గించాలన్న ప్రయత్నంలో అనుకూల‌ మీడియా రేవంత్ వ్యాఖ్యలను తెలంగాణకు మాత్రమే పరిమితం చేస్తూ, చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే అంశాలను కట్ చేసి ఏపీ ఎడిషన్లలో ప్ర‌చురించింది. ఈ తీరుతో ఏపీ పాఠకులను తప్పుదారి పట్టించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యవహారంలో సాక్షి మీడియా మాత్రం రేవంత్ వ్యాఖ్యలను యథాతథంగా ప్రచురిస్తూ, విశ్లేషణలతో ప్రజల ముందుకు తీసుకొచ్చింది. సోషల్ మీడియాలోనూ ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు రావడంతో, రాయలసీమకు ఈ పథకం ఎంత కీలకమో, చంద్రబాబు నిర్ణయంతో ఆ ప్రాంతానికి ఎంత నష్టం జరుగుతోందో ప్రజలకు అవగతమైంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అనుకూల‌ మీడియాను అడ్డుపెట్టుకుని మొత్తం బాధ్యతను జగన్‌పై నెట్టే ప్రయత్నం ప్రారంభించింది. జగన్ వల్లే రాయలసీమ లిఫ్ట్ ఆగిందంటూ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది.

ఈనాడు పత్రిక తెలంగాణ ఎడిషన్‌లో రేవంత్ వ్యాఖ్యలను కొంతమేర ప్రచురించినా, ‘నేనే రాయలసీమ లిఫ్ట్ ఆపించాను’ అన్న కీలక అంశాన్ని ప్రాధాన్యత లేకుండా లోపలి పేజీల్లో పరిమితం చేసింది. ఏపీ ఎడిషన్‌లో అయితే ఆ వ్యాఖ్యల జాడే కనిపించలేదు. బదులుగా మరుసటి రోజు ఏపీ మంత్రుల ప్రకటనలను ఫ్రంట్ పేజీలో వేసి, మొత్తం వివాదాన్ని జగన్ చుట్టూ తిప్పే ప్రయత్నం చేసింది. హరీశ్ రావు చేసిన పవర్ పాయింట్ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కూడా అనుకూల అనుకూల‌ మీడియా చంద్రబాబుపట్ల తన విధేయతను చాటుకుంది.

ఇక ఏపీ మంత్రులు ఎన్జీటీ ఆదేశాలతోనే 2020లో పనులు ఆగిపోయాయని చెబుతూ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పక్కన పెట్టారు. అయితే ఎన్జీటీలో ఫిర్యాదులు చేసినది అప్పట్లో తెలంగాణ టీడీపీ సహకారంతోనే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్జీటీ ఆదేశాలున్నప్పటికీ జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనులు కొనసాగించిందన్న రికార్డులు బయటకు వచ్చాయి. నమస్తే తెలంగాణ సహా పలు మీడియా సంస్థలు కూడా అప్పట్లో 85 శాతం పనులు పూర్తయ్యాయని రాసిన క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మొత్తం వ్యవహారం టీడీపీ–కాంగ్రెస్ మధ్య ఉన్న మౌన ఒప్పందాలపై అనుమానాలను బలపరుస్తోంది. రేవంత్ రెడ్డి ఏకాంతంగా చంద్రబాబును ఒప్పించానని, తనపై గౌరవంతోనే ఆయన పథకాన్ని నిలిపివేశారని బహిరంగంగా చెప్పినా, టీడీపీ నేతలు మాత్రం మొక్కుబడి సమాధానాలతో సరిపెట్టుకున్నారు. రాయలసీమకు చెందిన చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం సమంజసమేనా? అన్న ప్రశ్నకు కూటమి నేతలు నేరుగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు.

మొత్తానికి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వివాదం అనుకూల‌ మీడియాకు తీవ్రమైన ఇబ్బందిగా మారింది. వాస్తవాలను ఎదుర్కొనలేక, బాధ్యతను జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తూ విశ్వసనీయతను మరింత కోల్పోతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో చంద్రబాబుకు జరిగిన నష్టం స్పష్టంగా కనిపిస్తుండగా, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు రాజకీయంగా, మీడియాపరంగా మరింత బట్టబయలు అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment