భారత రాష్ట్రపతి శీతాకాల విడిది అయిన సికింద్రాబాద్ (Secunderabad)లోని బొల్లారమ్‌లో ఉన్న ‘రాష్ట్రపతి నిలయం’ (Rashtrapati Nilayam ప్రస్తుతం సందర్శకులతో కిటకిటలాడుతోంది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) నవంబర్ 21న ప్రారంభించిన ‘భారతీయ కళా మహోత్సవం-2025’ (Bhartiya Kala Mahotsav 2025ఇందుకు ప్రధాన కారణం. కేంద్ర సాంస్కృతిక, జౌళి, పర్యాటక శాఖల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ద్వారా దేశంలోని వైవిధ్యభరితమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజల ముందుంచుతున్నారు. వరుసగా రెండో ఏడాది జరుగుతున్న ఈ ఉత్సవానికి తొలి ఏడు రోజుల్లోనే లక్ష మందికి పైగా సందర్శకులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉచిత ప్రవేశంతో జరుగుతున్న ఈ మహోత్సవం నవంబర్ 30న ముగియనుంది.
ఈ ఏడాది ఉత్సవంలో ముఖ్యంగా పశ్చిమ భారతావనిపై దృష్టి సారించారు. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా రాష్ట్రాలు, అలాగే డయ్యూ – డామన్, దాద్రా అండ్ నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద సంఖ్యలో కళాకారులు, చేతివృత్తి నిపుణులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘పశ్చిమాలాప్’ కల్చరల్ షోలో రాజస్థాన్ యొక్క కల్బేరియా నృత్యం, మహారాష్ట్ర లావణీ నృత్యం, గుజరాత్ గర్భా వంటి 29 రకాల జానపద ప్రదర్శనలు జరిగాయి. ఇందులో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు, జాతీయ అవార్డు విజేతలు కూడా పాల్గొనడం విశేషం.
సందర్శకులను ఆకర్షించడంలో ఈ మహోత్సవం విజయవంతం కావడంతో పాటు, వివిధ రాష్ట్రాల ఉత్పత్తుల అమ్మకాలలోనూ దూసుకుపోతోంది. శుక్రవారం నాటికే గుజరాత్ బంధనీ, రాజస్థాన్ కోటా దోరియా చీరలు, కొల్హాపురీ చెప్పులు వంటి వాటి అమ్మకాలు దాదాపు రూ.2 కోట్లు దాటాయి. అలాగే పశ్చిమ భారతీయ రుచులను అందించే ఫుడ్ కోర్ట్‌లలో అమ్మకాలు రూ.27 లక్షలు దాటాయి. ‘ఏక్ భారత్… శ్రేష్ఠ భారత్’ ఆలోచనను ప్రోత్సహించే ఈ ఉత్సవంతో పాటు, సందర్శకులు రాష్ట్రపతి బస చేసే గదులు, వంటశాల నుంచి భోజనశాలకు దారి తీసే ప్రత్యేక సొరంగ మార్గం, చారిత్రక బహుమతులు వంటి ఎన్నో విశేషాలున్న రాష్ట్రపతి నిలయం భవనాన్ని కూడా ఉచితంగా సందర్శించే అవకాశం లభించింది.








