రంగారెడ్డి జిల్లా సర్వే, సిటీల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతని అక్రమఆస్తులను గుర్తించేందుకు సోదాలు నిర్వహించి, రూ. కోట్లకు పైగా విలువైన భూములు, నగదు, బంగారు, వెండి, కార్లు, ప్లాట్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసు తన సర్వీసులో రాయదుర్గ్, మహబూబ్‌నగర్, నారాయణపేట, అనంతపుర జిల్లాల్లో ఎక్కువగా విధులు నిర్వహిస్తూ, తప్పుడు సర్వే నివేదికల ద్వారా ప్రభుత్వ భూములను ప్రైవేటు చేయడం ద్వారా అక్రమాస్తులు సేకరించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
ఏసీబీ బృందాలు హైదరాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, రాయదుర్గ్ లోని శ్రీనివాసు సన్నిహితులు, బినామీల ఇంట్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి, ఆయనకు రాయదుర్గంలో ఒక ప్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11, మహబూబ్‌నగర్‌లో 4, నారాయణపేటలో 3 ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు. సోదాల సందర్బంగా 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి, రెండు కార్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్లు ఉన్నట్టు గుర్తించారు.
గతంలో తప్పుడు సమాచారాన్ని హైడ్రాకు అందించడంపై కూడా అతనిపై క్రిమినల్ కేసు ఉంది. సర్వే నంబర్లు మార్చడం, తప్పుడు నివేదికలతో భూములను ప్రైవేటు చేయించడం ద్వారా కూడబెట్టిన అక్రమాస్తులు సృష్టించిన శ్రీనివాసు ఇప్పుడు ఏసీబీ కస్టడీలో ఉన్నాడు.








