‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు తేజ సజ్జా, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘మిరాయ్’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. పలు వాయిదాల తర్వాత ఈ సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు, దాని చివరిలో రాముడి పాత్రకు సంబంధించిన చిన్న క్లిప్ చూపించారు, కానీ ఆ పాత్రలో ఎవరు నటించారనే విషయం స్పష్టంగా చూపించలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ‘మిరాయ్’ సినిమాలో రాముడి పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా నటించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా కథ నచ్చడంతో తేజ సజ్జా కోసం రానా ఈ కీలక పాత్రలో నటించారని సమాచారం.
సినిమా సెకండాఫ్‌లో వచ్చే కీలక సన్నివేశాలలో రాముడి పాత్ర ఎంట్రీ ఉంటుందని, ఇది ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది. ఈ సినిమాలో రానా పాత్రతో పాటు మరో సర్ప్రైజ్ కూడా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన మంచు మనోజ్, ఈ సినిమా తనకు ఒక ప్రత్యేక గుర్తింపు తెస్తుందని నమ్మకంగా ఉన్నాడు.








