ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా రాజమండ్రి (Rajahmundry) త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై మరో కేసు నమోదు అయ్యింది. ఆయనతో పాటు ప్రముఖ యాంకర్ (Anchor)పై కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది మేడా శ్రీనివాస్ (Meda Srinivas) ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ప్రసారమైన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో హిందూ ఇతిహాసాలు, దేవుళ్లు, భారత సైన్యం, ఆంధ్రులను అవమానించారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు క్రైమ్ నంబర్ 487/2025 కింద, U/s 196(1), 197(1), 353, 354, 299 R/w (3) Bns Act ప్రకారం కేసు నమోదు చేశారు. మేడా శ్రీనివాస్ తన ఫిర్యాదులో, ఓ మహిళా యాంకర్ వివాదాస్పద ప్రశ్నలను ఉద్దేశపూర్వకంగా అడిగి ఆర్జీవీని ప్రేరేపించారని పేర్కొన్నారు. ఇంకా, వర్మ వీడియోల వెనుక విదేశీ టెర్రరిస్టుల మద్దతు ఉండొచ్చని ఆరోపణలు చేశారు.
ఇప్పటికే ఆర్జీవీపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. వివిధ సందర్భాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రాజమండ్రిలో నమోదైన ఈ కేసుతో వర్మకు మరో షాక్ తగిలినట్లయింది.





 



