మెగా కుటుంబంలో ఆనందం నెలకొంది. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డకు ఉపాసన రాత్రి అపోలో ఆస్పత్రిలో జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
“రామ్ చరణ్, ఉపాసనలకు ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మించారని ఎంతో ఆనందంగా, కృతజ్ఞతతో ఈ విషయాన్ని పంచుకుంటున్నాం. తల్లి, పిల్లలు ముగ్గురూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. తాతామామలుగా ఈ చిన్నారులను మా కుటుంబంలోకి స్వాగతించడం మాకు అపారమైన ఆనందం, దైవిక ఆశీర్వాదం. ప్రతి ఒక్కరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు.
అపోలో ఆస్పిటల్ వద్ద చిరంజీవి వ్యాఖ్యలు
అపోలో ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “చాలా చాలా సంతోషంగా ఉంది. కొణిదెల కుటుంబం, కామినేని కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయాం. ఉపాసన, పిల్లలు ఇద్దరూ చాలా హెల్తీగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఎక్కడెక్కడి నుంచో మా ఇంట శుభం కలగాలని అందరూ కోరుకున్నారు. భగవంతుడి దయతో, హనుమాన్ కృపతో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ జన్మించారు. ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది” అని చిరంజీవి తెలిపారు.
పండుగ వాతావరణంలో అభిమానులు
ఈ శుభవార్త వెలువడగానే మెగా అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. మెగా కుటుంబంలోకి కవలల రాకతో అభిమానులు పండుగలా సంబరాలు చేసుకుంటున్నారు








