భారత ఆర్చరీ అసోసియేషన్ (India’s Archery Association) తొలి ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador)గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)ను నియమించింది. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 2 నుండి 12 వరకు ఢిల్లీ (Delhi)లోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ (Yamuna Sports Complex )లో జరగనుంది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అనేది భారతదేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ ఆధారిత ఆర్చరీ టోర్నమెంట్.
ఈ లీగ్‌లో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొంటారు. దేశంలో ఆర్చరీ క్రీడను ప్రోత్సహించడం, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తీసుకురావడం, ఒలింపిక్ కలను బలోపేతం చేయడం ఈ లీగ్ ప్రధాన లక్ష్యాలు. ఈ టోర్నమెంట్లో మొత్తం 6 జట్లు ఉంటాయి, వాటిలో 36 మంది భారతీయ ఆర్చర్లు, 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పాల్గొంటారు. ప్రపంచంలోనే తొలిసారిగా రికర్వ్, కాంపౌండ్ ఆర్చర్లు లైట్స్ కింద ఒకే ఫార్మాట్‌లో పోటీపడటం ఈ లీగ్ ప్రత్యేకత.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, “ఆర్చరీ క్రమశిక్షణ, ఏకాగ్రత, ధైర్యానికి ప్రతీక. ఈ విలువలు నాకు చాలా దగ్గరైనవి. ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావడం నాకు గర్వంగా ఉంది. ఇది భారత క్రీడాకారులకు ప్రపంచ స్థాయి వేదికను కల్పిస్తుంది. ఈ ప్రయత్నం ద్వారా కొత్త తరం అథ్లెట్లకు స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.







