ప్రస్తుతం ప్రేక్షకాదరణ పొందుతున్న చిత్రాలలో ‘రాజు వెడ్స్ రాంబాయి'(Raju Weds Rambayi) ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ(Movie), తొమ్మిది సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ, మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఈ చిత్రంపై అనూహ్యంగా క్రియేట్ అయిన హైప్, కలెక్షన్లలో కూడా కనిపిస్తోంది.
డా. నాగేశ్వరరావు పూజారి (Dr. Nageshwar Rao Poojari) సమర్పణలో, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్(Dolamukhi Subaltern Films) మరియు మాన్ సూన్స్ టేల్స్ (Monsoons Tales) బ్యానర్స్‌పై వేణు ఊడుగుల (Venu Udugula), రాహుల్ మోపిదేవి (Rahul Mopidevi) ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయిలు కంపాటి (Sailu Kampati) దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.7 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ట్రేడ్ వర్గాల అంచనాలకు తగ్గట్టే, మూవీ అద్భుతంగా ఆడుతోంది.
ఈ సినిమా కథ పూర్తిగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఉండటం, పాత్రల సంభాషణలు తెలంగాణ యాసలో సాగడం వలన దీనికి ‘నేటివిటీ’ సమస్య ఎదురైందనే చర్చ నడుస్తోంది. నైజాం ప్రాంతంలో, తెలంగాణ జిల్లాలలో ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం హైప్ పెద్దగా క్రియేట్ కాలేదు. తెలంగాణ నేటివిటీ ఎక్కువగా ఉండటం వల్లే ఏపీలో కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఏపీలో కూడా ఈ సినిమాకు అదే స్థాయిలో హైప్ వచ్చి టికెట్లు తెగితే, కలెక్షన్లు మరింత భారీగా పెరిగే అవకాశం ఉండేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.








