టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి విరుచుకుపడ్డారు. ‘వారణాసి’ (Varanasi) సినిమా టైటిల్ అనౌన్స్ ఈవెంట్లో హనుమంతుడి (Hanuman)పై రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజాసింగ్ రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిందువుల (Hindus) మనోభావాలను (Sentiments) దెబ్బతీశాయని ఆయన ఆరోపించారు. విశ్వాసం లేని వ్యక్తి దేవుళ్ళు, ధర్మంపై సినిమాలు తీసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు. రాజమౌళి సినిమాలను హిందువులు బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
“నిజంగా నాస్తికుడివైతే స్పష్టంగా డిక్లేర్ చేయాలి. ఒకవైపు దేవుళ్ల గురించి తప్పుగా మాట్లాడి, మరోవైపు అదే భావాలను చూపిస్తూ సినిమాలు తీసి లాభాలు పొందడం సరికాద”ని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా రాజమౌళి హిందూ దేవతలపై ఇష్టారీతిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
హిందూ ధర్మం (Hindu Religion)పై ఎవరు తప్పుగా మాట్లాడినా సహించబోమని హెచ్చరించిన రాజాసింగ్, ఇలాంటి నాస్తిక దృష్టితో తీసే సినిమాలను ప్రజలు చూడకూడదని కోరారు. మన ధర్మాన్ని అవమానిస్తే దానికి ప్రజలు తగిన సమాధానం ఇస్తారని ఆయన కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో విశేష చర్చనీయాంశమయ్యాయి.








