జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక (By-Election) ఫలితాల నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) బీజేపీ (BJP) నాయకత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ (Naveen Yadav)ను అభినందించిన ఆయన, ఈ ఓటమికి బీజేపీ లోపలే పలు తప్పిదాలు కారణమని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల ఓటమికి కేసీఆర్ ఎంతగా ప్రయత్నించారో… జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా అదే విధంగా అన్ని ప్రయత్నాలు చేశారని సంచలన కామెంట్స్ చేశారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడంతో తనకు కలిగిన బాధను గుర్తుచేశారు. పార్టీ పడిపోతుందనే విచారంతో బయటకు వచ్చినా, ఇప్పటికీ బీజేపీని తన పార్టీగానే భావిస్తున్నానని చెప్పారు. అయితే పార్టీ నాయకత్వంలో స్వేచ్ఛ లేకపోవడమే అసలు సమస్య అని ఆరోపించారు. ప్రతీ ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడే స్వేచ్ఛ కోల్పోయారని, దీనిపై సీనియర్ నేతలు స్పందించడం లేదని పేర్కొన్నారు.
ఫలితాల అనంతరం బీజేపీ నేతలు కేవలం మీటింగ్ పెట్టుకుని సమీక్ష చేసి వెళ్లిపోవడం మాత్రమే జరుగుతోందని రాజాసింగ్ విమర్శించారు. లోపాలు ఎక్కడ జరిగాయో తెలుసుకుని సరిదిద్దే ప్రయత్నం చేయకపోతే తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు గెలుపు కోసం పని చేస్తుంటే, బీజేపీ నాయకులు ఎంత మార్జిన్‌తో ఓడిపోవాలని మాత్రమే ఆలోచిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చివరిగా, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని నేరుగా ఉద్దేశిస్తూ “ప్లీజ్… పార్టీని కాపాడండి.. నేను తప్పు చేస్తే చెప్పండి” అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీ తిరిగి బలపడాలంటే నాయకత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు.








