లోక్‌సభ ప్రతిపక్ష నేతగా తొలి సెషన్‌లో దుమ్ము రేపిన రాహుల్ గాంధీ, పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈసారి ఆయన టార్గెట్ భారత ఎన్నికల సంఘం. “ఈసీ చీటింగ్ చేస్తోంది.. మా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో చీటింగ్
బిహార్‌లో ఓటర్ లిస్టు రివిజన్‌పై మండిపడిన రాహుల్, కర్ణాటకలోని ఓ నియోజకవర్గాన్ని ఉదహరిస్తూ చెప్పిన విషయాలు తలదించుకునేలా ఉన్నాయి. “ఒక్క సీటులోనే ఈ స్థాయిలో చీటింగ్ అయితే, దేశవ్యాప్తంగా ఇంకా ఎంత జరుగుతుందో” అని ప్రశ్నించారు. 45-65 ఏళ్ల వయస్సు గల వేలాది కొత్త ఓట్లను అక్రమంగా చేర్చారని, తమ బృందం ఈ తప్పులను గుర్తించిందని చెప్పారు. ఈ ఘటనలను తాము వదలమని, దర్యాప్తు కోసం తమవద్ద ఉన్న డాక్యుమెంటేషన్‌తో ముందుకు వెళతామని స్పష్టం చేశారు.
ఎన్నికల మేనిప్యులేషన్
“ఇలా వ్యవస్థను మలచుకుని ఎవరైనా తప్పించుకుంటామని ఈసీ అనుకుంటే అది పెద్ద పొరపాటు. ప్రజాస్వామ్యంలో మేము న్యాయబద్ధంగా పోరాడతాం. ఇదే మా నమ్మకం” అని రాహుల్ చెప్పారు. రాహుల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం అధికార ప్రతినిధులు స్పందించారు. “ఇవి పూర్తిగా నిరాధార ఆరోపణలే. కర్ణాటక కేసు ఇప్పటికే హైకోర్టులో ఉంది. కేసు తీర్పు వచ్చే వరకు ఎవ్వరూ ఎలాంటి ఆరోపణలు చేయవద్దు” అని హెచ్చరించారు. ఈ విషయంపై పిటిషన్ దాఖలయిందని, కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.