క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) చిన్న కుమారుడు (Younger Son), వికెట్ కీపర్-బ్యాటర్ అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) అద్భుతమైన ఫామ్ తో దూసుకుపోతున్నాడు. రాబోయే అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీ (Vinoo Mankad Trophy) కోసం ప్రకటించిన కర్ణాటక జట్టుకు (Karnataka Team) కెప్టెన్ (Captain)గా అన్వయ్ ఎంపికయ్యాడు. జూనియర్ క్రికెట్‌లో అతని స్థిరమైన ప్రదర్శనకు ఇది నిదర్శనం. ముఖ్యంగా, అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో వరుసగా రెండో సీజన్‌లోనూ అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా అన్వయ్ నిలిచాడు. కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే 91.80 సగటుతో 459 పరుగులు చేసి, రెండు సెంచరీలు నమోదు చేశాడు.
యువ ప్రతిభకు వేదికగా నిలిచే ఈ టోర్నమెంట్‌లో అన్వయ్ నాయకత్వంలో కర్ణాటక జట్టు సత్తా చాటాలని చూస్తోంది.
వినూ మన్కడ్ ట్రోఫీకి కర్ణాటక జట్టు:
అన్వయ్ ద్రవిడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఎస్. మణికంఠ్ (వైస్ కెప్టెన్)తో పాటు నితీష్ ఆర్య, ఆదర్శ్ డి ఉర్స్, ప్రణీత్ శెట్టి, వాసవ్ వెంకటేష్, అక్షత్ ప్రభాకర్, సి. వైభవ్, కులదీప్ సింగ్ పురోహిత్, రతన్ బి.ఆర్, వైభవ్ శర్మ, కేఏ తేజస్, అథర్వ్ మాలవీయ, సన్నీ కంచి మరియు రెహాన్ మహమ్మద్ (వికెట్ కీపర్).
రంజీ జట్టులోకి కరుణ్ నాయర్ రీఎంట్రీ
వినూ మన్కడ్ ట్రోఫీతో పాటు, సీనియర్ రంజీ ట్రోఫీ కోసం ప్రకటించిన కర్ణాటక జట్టులోకి కీలక ప్లేయర్ కరుణ్ నాయర్ తిరిగి వచ్చాడు. మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా కొనసాగనున్నారు. గత రెండు సీజన్లలో విదర్భ తరఫున ఆడిన కరుణ్ నాయర్ తిరిగి రాక, జట్టు బ్యాటింగ్ లైనప్‌కు అనుభవాన్ని, బలాన్ని చేకూర్చనుంది.







