ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (Y. S. Sharmila) ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Y. S. Jagan Mohan Reddy) చేసిన విమర్శలను వైసీపీ(YSRCP) రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Rachamallu Siva Prasad Reddy) తీవ్రంగా ఖండించారు. షర్మిల చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయని, అసలు జగన్ ఆమెకు చేసిన అన్యాయం ఏంటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి (Y. S. Rajasekhara Reddy) బతికున్నప్పుడే తన ఆస్తులను జగన్‌కు, షర్మిలకు సమానంగా పంచారని రాచమల్లు గుర్తుచేశారు. షర్మిలకు అందిన ఆస్తుల వివరాలను ఆయన బహిరంగంగా వెల్లడించారు.
షర్మిలకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని నివాసం, ఇడుపులపాయలో 51 ఎకరాల సాగు భూమి, 15 మెగావాట్ల ఎస్సారెస్ స్మాల్ హైడ్రో ప్రాజెక్టు, స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, విజయవాడలోని యువరాజ్ థియేటర్లో 36 శాతం వాటా, పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్ల స్థలం, విజయలక్ష్మి ట్రేడ్ అండ్ మినరల్స్‌లో 100 శాతం వాటా, రైల్వే కోడూరు శెట్టిగుంటలో 90 ఎకరాల వ్యవసాయ భూమి, రైల్వే కోడూరులోని ఇల్లు, “ఇవే కాకుండా, వైఎస్సార్ మరణించినప్పటి నుంచి తనను విభేదించే వరకు తన సొంత సంపాదనలో నుంచి రూ. 236 కోట్లు వైఎస్ జగన్ షర్మిలకు ఇచ్చారు. ఇంత చేసిన అన్నను పట్టుకుని ‘అన్న అనే పదానికే కళంకం’ అంటావా?” అని రాచమల్లు నిలదీశారు.
చంద్రబాబు డైరెక్షన్‌లోనే అంతా..!
షర్మిల, సునీతల (Sunitha) ఫోన్ కాల్ డేటా తీస్తే వారు ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబులతో(ChandraBabu Naidu) టచ్‌లో ఉన్న విషయం బయటపడుతుందని రాచమల్లు ఆరోపించారు. “మీ ఇంట్లో చర్చించుకునే విషయాలు మరుసటి రోజే ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్‌గా ఎలా వస్తున్నాయి? జగన్ జైలుకు వెళ్లాలనే కుట్రతోనే ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులను షర్మిల తన పేరు మీదకు మార్చుకోవాలని చూశారు” అని ఆయన మండిపడ్డారు. “పగోడు జగన్‌ను 16 నెలలు జైల్లో పెడితే, సొంత చెల్లెలు ఆయనను 32 నెలలు జైల్లో పెట్టాలని చూసింది. ఇది ఏ రకమైన ప్రేమ?” అని ఆయన ప్రశ్నించారు.
వదిన భారతమ్మ గొప్పతనం చూడండి..
సాధారణంగా ఏ ఇంటి కోడలైనా ఆడబిడ్డకు ఆస్తిలో సమాన వాటా ఇస్తుంటే అంగీకరించదని, కానీ భారతమ్మ మాత్రం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని రాచమల్లు కొనియాడారు. “మీ అన్న, తండ్రి కంటే భారతమ్మ వెయ్యి రెట్లు గొప్పది. అలాంటి వ్యక్తిపై కూడా మీరు విమర్శలు చేయడం సిగ్గుచేటు” అని విమర్శించారు.
ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే శాంతిస్తారా?
“షర్మిలకు జగన్ ఆస్తులు రాసిచ్చినా సంతృప్తి లేదు. ఆమె శాంతించాలంటే ముఖ్యమంత్రి పదవినే పంచాలేమో! రాజశేఖరరెడ్డి కూతురు ఇలా చంద్రబాబు పంచన చేరుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు సైకిల్ ఎక్కకపోయినా, ఆమె మనసంతా టీడీపీనే(TDP)” అని ఎద్దేవా చేశారు. “ఇక మీదట జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించేది లేదు. వైఎస్సార్ కూతురు అనే గౌరవం పక్కన పెట్టి ప్రశ్నిస్తాం. మీరు చంద్రబాబు చేతిలో మోసపోయి, చివరకు మళ్లీ ఆ అన్న వద్దకే ప్రాయశ్చిత్తం కోసం వస్తారు” అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.








