భాష్యం స్కూల్‌లో దారుణం.. విద్యార్థిని త‌ల‌ ప‌గ‌ల‌గొట్టిన ఉపాధ్యాయుడు

భాష్యం స్కూల్‌లో దారుణం.. విద్యార్థిని త‌ల‌ ప‌గ‌ల‌గొట్టిన టీచ‌ర్‌

పుంగనూరు (Punganur)లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుంగ‌నూరు భాష్యం స్కూల్‌ (Bhashyam School)లో ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల విద్యార్థిని సాత్విక నాగశ్రీ (Satvika Nagashree)పై ఉపాధ్యాయుడు (Teacher) దాడి చేసిన సంఘటన తీవ్ర‌ కలకలం రేపుతోంది.

బాధితురాలి త‌ల్లి వివ‌రాల ప్ర‌కారం.. త‌న కూతురుని స్కూల్‌కు పంపించే స‌మ‌యంలో ఇడ్లీల‌తో క్యారియ‌ర్ క‌ట్టి బ్యాగ్‌లో పుస్త‌కాలు పెట్టి పంపించాన‌ని, ఉపాధ్యాయుడు సలీం (Saleem) భాష టిఫిన్ బాక్స్ ఉన్న బ్యాగ్‌తో బలంగా కొట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడిందన్నారు. తలలో గాయం కావడంతో హుటాహుటిన మ‌ద‌న‌ప‌ల్లి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, వైద్యుల సూచ‌న‌ల మేర‌కు స్కానింగ్‌, ఎక్స్‌రే తీయించ‌గా, త‌న కుమార్తె పుర్రెపై చిట్లినట్లు వైద్యులు గుర్తించారని ఆ త‌ల్లి విజేత క‌న్నీరుపెట్టుకున్నారు. ఈ ఘటనతో బాలిక అస్వస్థతకు గురై మదనపల్లె ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు.

అయితే, ఈ విష‌యాన్ని స్కూల్ ప్రిన్సిపల్‌ (Principal) సుబ్రహ్మణ్యం (Subrahmanyam)ను ఫిర్యాదు చేయగా, ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారని విజేత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న కుమార్తెపై దాడి చేసిన ఉపాధ్యాయుడు కూడా త‌న‌కేమీ తెలియ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. త‌న కుమార్తెకు న్యాయం జ‌ర‌గాల‌ని ఆమె డిమాండ్ చేశారు. నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీఐ(CI) సుబ్బారాయుడు (Subbarayudu) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికులు పాఠశాల యాజ‌మాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment