పులివెందుల మెడికల్ కాలేజీపై మ‌రో కుట్ర.. వైసీపీ తీవ్ర ఆగ్ర‌హం

పులివెందుల మెడికల్ కాలేజీపై మ‌రో కుట్ర.. వైసీపీ తీవ్ర ఆగ్ర‌హం

పులివెందులలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీపై మరోసారి కూటమి ప్రభుత్వ చర్యలు వివాదాస్పదంగా మారాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యాధునిక సౌకర్యాలతో, ఆధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కాలేజీ నుంచి ఇప్పుడు పరికరాలను ఇతర కళాశాలలకు తరలిస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు, వైసీపీ నాయకులు దీనిని “పులివెందుల అభివృద్ధిపై కూటమి కక్ష”గా ఆరోపిస్తున్నారు.

డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) ఆదేశాల మేరకు పులివెందుల‌ కాలేజీలోని పరికరాలు వేరొక మెడిక‌ల్ కాలేజీల‌కు తరలిస్తున్న‌ట్లుగా సూపరింటెండెంట్ వెల్లడించారు. ఈ చర్యతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన 50 సీట్లను వెనక్కు పంపి, సిబ్బందిని ఇతర కాలేజీలకు బదిలీ చేసిన నేపథ్యంలో, ఇప్పుడు పరికరాల తరలింపు మరో కుట్ర‌గా భావిస్తున్నారు.

ఈ పరిణామాలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఆందోళన కొనసాగుతోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం ప్రజా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌కు పాల్ప‌డుతోంది. పైగా పులివెందులలో ఉన్న ఆధునిక పరికరాలను ఇతర కాలేజీలకు తరలించడం దారుణం” అని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల వైద్య సేవలు అభివృద్ధి దిశగా సాగాయని, ఇప్పుడు ఆ ప్రతిష్టకు కూట‌మి ప్ర‌భుత్వం భంగం కలిగిస్తోంద‌ని ఆయన ఆరోపించారు.

“పులివెందుల అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష్య? ఇక్కడి ప్రజలతో ఎందుకింత అన్యాయం? స్థానిక టీడీపీ నాయకులు ఈ చర్యలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? కూట‌మి ప్ర‌భుత్వ విధ్వంసం సాగుతోంది” అని మండిప‌డ్డారు. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీకరణ, పరికరాల తరలింపు నిర్ణయాలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని, వైద్య రంగంపై రాజకీయ దోపిడీని ఆపాలని ఎంపీ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment