వైఎస్సార్ జిల్లాలో మరోసారి పోలీసు అధికారి బదిలీ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐగా పనిచేస్తున్న శ్రీరామ్‌ను కేవలం నెలన్నర రోజుల్లోనే బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించినందుకే ఈ బదిలీ వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
సీఐ శ్రీరామ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేకాట క్లబ్బులపై దాడులు, అక్రమ బెల్టు షాపుల మూసివేత వంటి చర్యలు తీసుకోవడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. గతంలో ఆయన పనితీరును చూసి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కూడా బహిరంగంగానే అభినందించిన విషయం తెలిసిందే.
అయితే, కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతల అక్రమాలకు సహకరించలేదన్న కారణంతోనే శ్రీరామ్‌ను బదిలీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిపబ్లిక్ డే రోజునే డీఐజీ కోయ ప్రవీణ్ బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం మరింత వివాదానికి దారి తీసింది. ఇదే తరహాలో ఇటీవలే తమ మాట వినలేదన్న కారణంతో డీఎస్పీ భావనను కూడా బదిలీ చేయించారని ప్రచారం సాగుతోంది. క్రికెట్ బెట్టింగులకు సంబంధించి తమ అనుచరులను అరెస్ట్ చేశారంటూ స్థానిక ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి పలు మార్లు డీఎస్పీపై ఆరోపణలు చేయడం, చివరకు బదిలీ వరకు తీసుకెళ్లడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
పోలీసు అధికారులు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తే బదిలీలే ‘బహుమానాలుగా’ మారుతున్నాయా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించే అధికారులకు రక్షణ ఉండాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది.








