నటుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్వీరాజ్ అనారోగ్యానికి గురయ్యారు. హైబీపీ (హై బ్లడ్ ప్రెజర్) కారణంగా ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి బెడ్‌పై వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఫృథ్వీరాజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, డాక్టర్లు ఆయనను పర్యవేక్షణలో ఉంచారు. ఈ ఘటనకు సంబంధించి ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల జరిగిన ‘లైలా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఫృథ్వీరాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఫృథ్వీ వ్యాఖ్యల కారణంగా సినిమాను బాయ్‌కాట్ చేస్తున్నామని వైసీపీ అభిమానులు ఎక్స్ (ట్విట్టర్)లో ట్రెండ్ సృష్టించారు. బాయ్‌కాట్‌లైలా (#BoycottLaila) హ్యాష్‌ట్యాగ్‌ను దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంచారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ఏకంగా 1.30 లక్షల ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. దీంతో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరారని కామెంట్లు వినిపిస్తున్నాయి.








