2024 ఏడాదికి సంబంధించిన క్రీడా రంగంలో విశిష్ట ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ క్రీడా అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు సహా అనేక పురస్కారాలను అందజేశారు.
ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు
చెస్ దిగ్గజం డి. గుకేశ్, షూటర్ మను బాకర్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ ప్రవీణ్ కుమార్‌లు రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన జ్యోతి యర్రాజి మరియు దీప్తి జీవాంజిల అర్జున అవార్డులను అందుకున్నారు. ఇది తెలుగు క్రీడాకారుల ప్రతిభకు మరో గర్వకారణంగా నిలిచింది.
2024 సంవత్సరానికి గానూ ఖేల్ రత్న అవార్డులు 4, అర్జున అవార్డులు 32, ద్రోణాచార్య అవార్డులు 3 అందజేశారు. ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి స్వయంగా అందజేశారు. కార్యక్రమం మొత్తం దేశ క్రీడా రంగంలో ప్రతిభావంతుల గుర్తింపుకు నిదర్శనంగా నిలిచింది.