ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ ప్రాణాలను ఆపాయంలో పడేశారు వైద్యులు. ఈ ఘటనలో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఖమ్మంలోని పీపుల్స్ నర్సింగ్‌హోమ్ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రసవం చేసే సమయంలో ఓ మహిళ కడుపులో సర్జికల్ టవల్‌ను వదిలేసిన ఘటనలో, జిల్లా వినియోగదారుల ఫోరం కీలక తీర్పు వెలువరించింది. వైద్యులు బాధితురాలికి పరిహారంతో పాటు వైద్య ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. మంగళవారం వెలువడిన ఈ తీర్పు వివరాలు ఇలా ఉన్నాయి..
జిల్లాలోని ఏదులాపురం గ్రామానికి చెందిన కాండ్రుకోట సౌమ్య ప్రసవం కోసం 2021 డిసెంబర్ 1న పీపుల్స్ నర్సింగ్‌హోమ్‌లో చేరారు. అక్కడి వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి, ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, శస్త్రచికిత్స అనంతరం సౌమ్య కడుపు నొప్పి, వాంతులు, ఇతర సమస్యలతో బాధపడటం మొదలుపెట్టారు. వైద్యులను సంప్రదించగా, వారు సాధారణ సమస్యగానే భావించి మందులు ఇచ్చారు.
పరిస్థితి మెరుగుపడకపోవడంతో, 2022 ఏప్రిల్ 1న సౌమ్య తిరిగి అదే ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ స్కానింగ్ చేయించి, మరో డాక్టర్ వద్దకు పంపించారు. ఆ వైద్యులు స్కానింగ్ రిపోర్ట్స్‌ను పరిశీలించి, సౌమ్య కడుపులో రాయి వంటి పదార్థం ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని సౌమ్య పీపుల్స్ నర్సింగ్‌హోమ్ వైద్యులకు ఫోన్ ద్వారా తెలియజేయగా, వారు ఆమెను కలిసేందుకు నిరాకరించారు.
ఆ తర్వాత ఏప్రిల్ 4న సౌమ్య తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, ఆమెను మరో ఆస్పత్రిలో చేర్చారు. ఏప్రిల్ 6న అక్కడ ఆపరేషన్ చేయగా, సౌమ్య కడుపులో 15X20 సైజులో ఉన్న సర్జికల్ టవల్ బయటపడింది.
ఈ ఘటనతో బాధితురాలు సౌమ్య జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. కేసు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరం సభ్యులు, వైద్యుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చారు. పీపుల్స్ నర్సింగ్‌హోమ్ వైద్య ఖర్చుల కింద రూ. 1,35,533ను 8 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించారు. అదనంగా, పరిహారం, మానసిక వేదన, ఇబ్బందులకు గాను రూ. 5 లక్షలు, అలాగే కేసు ఖర్చుల కింద రూ. 40 వేలు చెల్లించాలని మంగళవారం తీర్పునిచ్చారు. ఈ తీర్పు బాధితురాలికి న్యాయం చేకూర్చింది.