ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ముండ్లమూరు మండలంలో భూమి సుమారు ఒక సెకను పాటు కంపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ల ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రతను కనబరిచాయి.
ఈ ఘటనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం రిక్టార్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. వరుసగా రెండు రోజులుగా ప్రకంపనలు రావడంతో ప్రజలలో ఆందోళన నెలకొంది.
స్థానిక అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. భూకంపాల తీవ్రత, దాని కారణాలను విశ్లేషించేందుకు నిపుణులను రంగంలోకి దింపారు. ప్రజల్లో భయాన్ని తగ్గించేందుకు అధికారులు అవగాహన చర్యలు చేపడుతున్నారు.