ముంబైలోని ప్రసిద్ధ లాల్ బాగ్ రాజా వినాయక మండపం వద్ద నటి ప్రగ్యా జైస్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. లాల్ బాగ్ రాజాను దర్శించుకునేందుకు వచ్చిన ఆమెను, మరో నటి ప్రియాంక చౌదరిని సామాన్య భక్తులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీనితో వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇది ఒక రకంగా దాడి లా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సామాన్య భక్తులకు కూడా ఇదే పరిస్థితి
లాల్ బాగ్ రాజా మండపంలో సామాన్య భక్తులు సైతం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో చాలామంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఒకరు తన సోదరికి తలకి గాయమైందని, మరొకరు తన తల్లి దుస్తులు చిరిగిపోయాయని, ఇంకొకరు తమ తండ్రి ఊపిరాడక ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
కొందరు సెలబ్రిటీలకు మాత్రం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని, అయితే ప్రగ్యా జైస్వాల్, ప్రియాంక చౌదరి లాంటివారు వచ్చినప్పుడు వారికి కూడా ఇబ్బందులు సృష్టిస్తున్నారని విమర్శలు వచ్చాయి. గతంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అవనీత్ కౌర్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మరింత విమర్శలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.