పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పీఆర్వో (Prabhas PRO) గా చెప్పుకునే వ్యక్తిపై బెదిరింపుల ఆరోపణలతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. “డయల్ న్యూస్ (Dial News)” యూట్యూబ్ ఛానెల్ జర్నలిస్ట్ విజయ్‌సాధు (Vijay Sadhu) ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. విజయ్‌సాధు తన ఛానెల్‌లో ఈ నెల 4న “డార్లింగ్ ఇన్ డేంజర్ (Darling in Danger)” అనే శీర్షికతో ప్రభాస్ మేజర్ సర్జరీ చేయించుకున్నట్లు ఓ వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఈ వార్త వైరల్ కావడంతో, మరుసటి రోజు సురేష్ కొండి (Suresh Kondi) అనే వ్యక్తి విజయ్‌సాధుకు ఫోన్ చేసి తాను ప్రభాస్ పీఆర్వోనని పరిచయం చేసుకున్నాడు.
ప్రభాస్ సర్జరీ వార్తకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? అని సురేష్ అతన్ని ప్రశ్నిస్తూ, వెంటనే వీడియోను తొలగించాలని కోరాడు. విజయ్‌సాధు అలా చేయకపోవడంతో, ఆ పోస్ట్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ గ్రూప్‌లలో షేర్ చేసి, యూట్యూబర్‌పై దాడికి పురిగొల్పినట్లుగా తెలుస్తోంది.
ఫ్యాన్స్ ఆగ్రహం.. ప్రాణహాని బెదిరింపులు
ప్రభాస్ అభిమానులు విజయ్‌సాధుకు ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా బెదిరించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతే కాకుండా, ఈ నెల 6న 10 మంది యువకులు నేరుగా యూట్యూబ్ కార్యాలయానికి వచ్చి గొడవ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. విజయ్‌సాధు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సురేష్ కొండిపై కేసు (Case) నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








