టాలీవుడ్ (Tollywood)లో విలన్‌గా, కమెడియన్‌గా గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. బోడుప్పల్ (Boduppal)లోని ఆసుపత్రి (Hospital)లో వెంటిలేటర్ (Ventilator)పై చికిత్స పొందుతున్న ఆయనకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో చాలా కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో కనీసం ఒక కిడ్నీ అయినా మార్చాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా.
ఈ ఆర్థిక భారాన్ని మోయలేక, ఫిష్ వెంకట్ భార్య, కూతురు సాయం కోసం మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో, ప్రముఖ హీరో ప్రభాస్ (Prabhas) ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారనే ప్రచారం జోరుగా సాగింది. కిడ్నీ దాత దొరికితే ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేసుకోమని, అందుకు అవసరమైన డబ్బును ప్రభాస్ టీమ్ ఇస్తుందని ఫోన్ చేసిందని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి మీడియాతో చెప్పింది.
ప్రభాస్ పేరుతో మోసం: ఆశలు రేపి.. మరింత దుఃఖంలోకి
అయితే, ఈ ప్రచారం అంతా ఫేక్ కాల్ (Fake Call)తో జరిగిన మోసం అని తేలింది. ఆపదలో ఉన్న ఫిష్ వెంకట్ కుటుంబానికి ప్రభాస్ పేరు చెప్పి లేనిపోని ఆశలు కల్పించి, మరింత దుఃఖంలోకి నెట్టేశారని తెలుస్తోంది.
ఈ విషయంపై నటుడి భార్య స్పందిస్తూ, “ప్రభాస్ అసిస్టెంట్ అని చెప్పి మాకు ఓ ఫోన్ కాల్ వచ్చిన మాట వాస్తవమే. కావాల్సినంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు మేము ఫోన్ చేస్తే కలవడం లేదు. ప్రభాస్ నిజంగా డబ్బు ఇస్తే ఇచ్చామనే చెప్తాం. కానీ ఆయన మాకు ఏ సాయం చేయలేదు. ఇదంతా ఫేక్ న్యూస్. హీరోలు సాయం చేస్తే బాగుండు. మా ఇల్లు అమ్మి ఆపరేషన్ చేద్దామన్నా ఆ డబ్బు దేనికీ సరిపోదు” అని ఆవేదన వ్యక్తం చేసింది.
ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి కూడా స్పందిస్తూ, “ప్రభాస్ పీఏ అంటూ ఐదు రోజుల కిందట నాకు ఫోన్ కాల్ వచ్చింది. మీకు సాయం కావాలంటే చెప్పండి, తప్పకుండా చేస్తామని మాటిచ్చారు. నేను మా నాన్న పరిస్థితిని వివరించాను. అందుకాయన.. ప్రభాస్ సార్ షూటింగ్‌లో ఉన్నాడు.. కాసేపయ్యాక తిరిగి కాల్ చేస్తానన్నాడు. నేను నిజమేనని నమ్మాను. కానీ, రెండు రోజుల నుంచి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మాకు ప్రభాస్ వైపు నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు” అని స్పష్టం చేసింది.
ఫిష్ వెంకట్ ‘బలుపు, ఒక లైలా కోసం, అత్తారింటికి దారేది, గబ్బర్‌సింగ్, దరువు, అదుర్స్, దిల్, సూపర్‌స్టార్ కిడ్నాప్, ఈడో రకం ఆడో రకం, గద్దలకొండ గణేశ్, ఖైదీ నెం.150’ వంటి అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆపదలో ఉన్న ఆయనకు ఇలాంటి మోసం జరగడంపై సినీ వర్గాలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.