ప్రభాస్ సినిమాపై వివ‌క్ష చూపారా..? సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌

ప్రభాస్ సినిమాపై వివ‌క్ష చూపారా..? సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపిందా? అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టికెట్ రేట్ల పెంపు అంశంలో సీఎం రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) వ్యవహరించిన తీరు ప్రభాస్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు సంప్రదించినప్పటికీ, ప్రభాస్ పర్సనల్‌గా వచ్చి రిక్వెస్ట్ చేయలేదనే కారణంతోనే ప్రభుత్వం ప్రతీకార ధోరణి ప్రదర్శించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి, ప్రభాస్ సినిమాల నిర్మాతలు టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని సంప్రదించగా… రెండింటికీ ఒకే రోజున మెమోలు సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ (The Raja Saab) సినిమా విషయంలో మాత్రం ప్రభుత్వం చివరి నిమిషం వరకూ మెమో విడుదల చేయకుండా వేధించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు గంట ముందు మెమో ఇచ్చినా, అప్పటికే హైకోర్టు స్టే రావడంతో సాధారణ రేట్లకే టికెట్ల విక్రయం జరగాల్సి వచ్చింది.

ఇక చిరంజీవి సినిమా విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరు సినిమా టికెట్ రేట్ల పెంపు మెమోను ఈ నెల 8వ తేదీన సిద్ధం చేసినప్పటికీ, 10వ తేదీ వరకూ గోప్యంగా ఉంచి… హైకోర్టుకు సెలవులు ప్రారంభమైన తర్వాత విడుదల చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయాల్లో ద్వంద్వ ప్రమాణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సినీ వర్గాలు, అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారంతో ప్రభాస్‌ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసిన పాన్ ఇండియా సినిమాను అడ్డుకుంటూ, సాధారణ సినిమాలకు మాత్రం టికెట్ రేట్ల పెంపుకు అనుమతించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్ని హైదరాబాద్‌కు రప్పిస్తామని వేదికలపై ప్రసంగాలు చేసే సీఎం రేవంత్ రెడ్డి… ప్రభాస్ లాంటి స్టార్ సినిమా విషయంలో ఎందుకు ఇలా వ్యవహరించారంటూ మండిపడుతున్నారు.

వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్‌పై ఈ స్థాయిలో వివక్ష చూపడం ఏమిటన్నది ఇప్పుడు సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. పర్సనల్‌గా వచ్చి రిక్వెస్ట్ చేయలేదనే అక్కసుతోనే పాన్ ఇండియా సినిమాను ఇలా తొక్కేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా స్పష్టత ఇస్తారా అనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment