నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల అరెస్టై కోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న పోసానికి నిన్న రాత్రి ఛాతి నొప్పి రావడంతో జైలు అధికారులు రాజంపేట ప్రభుత్వ ఆస్ప్రతిలో చేరారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళికి ఈసీజీ పరీక్షల్లో స్వల్ప తేడాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను దూషించిన కేసులో పోసాని కృష్ణమురళిని ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన సతీమణి కుసుమలత వివరించారు. ఆస్పత్రికి కూడా వెళ్లకుండా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లోనే పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.