రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాల్సిందే.. బండి బ‌హిరంగ లేఖ‌

రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాల్సిందే.. బండి బ‌హిరంగ లేఖ‌

తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. రేషన్ కార్డుల (Ration Card)పై, రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫొటో తప్పనిసరిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి బహిరంగ లేఖ రాశారు. దీంతో మరోసారి కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

బండి సంజయ్‌ లేఖలో ఏముంది?
బండి సంజయ్‌ తన లేఖలో ప్రధానంగా నాలుగు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో తప్పనిసరిగా ముద్రించాల‌ని, లేదంటే రాష్ట్రానికి ఉచిత బియ్యం స‌ర‌ఫ‌రా నిలిపివేస్తామ‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేరును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన పేదలకు రైతు భరోసా, ఇండ్లు, రేషన్ కార్డుల మంజూరు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రకటించిన పథకాలు ఇప్పటికీ ఎందుకు అమలుకావడం లేదని త‌న లేఖ‌లో సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.

అంతేకాక, ప్రధాని మోదీ మంజూరు చేసే ఇళ్లకు “ఇందిరమ్మ” పేరు పెట్టడం అన్యాయం అని కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల క్రెడిట్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటోందని ఆరోపించారు. కాళేశ్వ‌రం, ఫాంహౌస్‌, డ్ర‌గ్స్‌, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాల గురించి ప్ర‌స్తావిస్తూ.. వాటి పురోగ‌తి ఏంట‌ని నిల‌దీశారు. త‌న లేఖ‌లో ఫార్ములా ఈ-కార్ రేసు కేసుపై కూడా బండి సంజ‌య్ ప్ర‌స్తావించారు. అన్ని ఆధారాలున్నా ఎందుకు అరెస్టు చేయ‌డం లేద‌ని సీఎం రేవంత్‌ను ప్ర‌శ్నించారు. కేంద్ర‌మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment