మహిళా భద్రతకు, విద్యార్థినుల సంక్షేమానికి అండగా నిలవడంలో భాగంగా సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘పోలీస్ అక్క’ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మహిళల భద్రతను మెరుగుపర్చడమే కాకుండా, వారికి అవసరమైన చట్టపరమైన అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తోందని ఆయన చెప్పారు.
మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు..
ఈ కార్యక్రమం భాగంగా జిల్లాలోని ప్రతీ పోలీస్ స్టేషన్ (పీఎస్) నుంచి ఒక మహిళా కానిస్టేబుల్‌ను ‘పోలీస్ అక్క’గా నియమించారు. వీరు షీ టీమ్స్‌తో కలిసి పని చేస్తూ, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి పలు ముఖ్యమైన అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తారు.
వివిధ అంశాలపై..
పోక్సో చట్టం, మహిళా చట్టాలు, హక్కులు, రక్షణ కోసం చట్టపరమైన సమాచారాన్ని అందించడం, గుడ్ టచ్ & బ్యాడ్ టచ్‌లో భాగంగా పిల్లలకు అనవసరమైన భయాందోళన లేకుండా అవగాహన కల్పించడం, ఈవ్ టీజింగ్, తగిన చర్యలు తీసుకునే విధానంపై స్పష్టమైన అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమం మిగతా జిల్లాల్లోనూ అమలు చేయడం ద్వారా మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.