దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఎర్రకోట (Red Fort) కూడలిలో భారీ పేలుడు (Massive Explosion) చోటుచేసుకుంది. పేలుడు ధాటికి మృతదేహాలన్నీ గుర్తుపట్టలేని స్థితిలో ఛిద్రమయ్యాయి. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్వయంగా ఆరా తీశారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగారు. ఘటన జరిగిన ప్రదేశం, పరిస్థితులు, బాధితుల స్థితి, భద్రతా చర్యలపై పూర్తి సమాచారం తీసుకున్నారు.
అమిత్ షా కూడా వెంటనే చర్యలు చేపట్టారు. ఐబీ చీఫ్, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌లతో మాట్లాడి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. పేలుడు వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకునేందుకు ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ, ఢిల్లీ స్పెషల్ సెల్‌లతో సమగ్ర విచారణ జరపాలని సూచించారు. స్వయంగా కేంద్రమంత్రి అమిత్ షా క్షతగాత్రులు చికిత్స పొందుతున్న లోక్ నాయక్ (Lok Nayak) ఆస్పత్రిని సందర్శించిన అనంతరం పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. అమిత్ షా పర్యటన సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు.
ఇక ఘటన నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆ వ్యక్తిని క్షుణ్ణంగా విచారిస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. సిగ్నల్ వద్ద ఐ20 కారు ఎలా పేలిందో, దానిలో ఎలాంటి పదార్థాలు ఉపయోగించారో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందాలు పని ప్రారంభించాయి.
ఢిల్లీలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ముంబై, హైదరాబాద్‌లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు పెంచారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, షాపింగ్ మాల్స్ వద్ద బాంబ్ స్క్వాడ్‌లు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పేలుడు ఘటనపై కేంద్రం గంభీరంగా వ్యవహరిస్తూ, నిందితులను త్వరలోనే పట్టుకునే దిశగా చర్యలు చేపట్టింది.








