ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జేవర్ వద్ద నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (Phase-1) ను శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, డబుల్ ఇంజన్ సర్కార్ సాధించిన ప్రగతిని వివరించారు.
ప్రపంచ సంక్షోభం – భారత్ సమర్థత
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని, అనేక దేశాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ప్రధాని అన్నారు. “ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. సామాన్య ప్రజలు, ముఖ్యంగా రైతులపై భారం పడకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది” అని ఆయన స్పష్టం చేశారు.
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ – నోయిడా
ఒకప్పుడు నోయిడా అంటే కేవలం అంధవిశ్వాసాలకు నిలయమని, ఇక్కడికి వస్తే ముఖ్యమంత్రి పదవి పోతుందనే భయంతో గత నేతలు ఇటువైపు రావడానికే భయపడేవారని మోదీ ఎద్దేవా చేశారు. నోయిడాలో సెమీకండక్టర్ ప్లాంట్, ఢిల్లీ-మీరట్ మెట్రో రైలు, ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇవన్నీ డబుల్ ఇంజన్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా ప్రతి రెండు నిమిషాలకు ఒక విమానం గాల్లోకి ఎగురుతుందని, ఇది ఉత్తర భారతాన్ని ప్రపంచంతో అనుసంధానిస్తుందని పేర్కొన్నారు.
యూపీఏపై విమర్శల బాణాలు
2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌ను దోచుకుందని ప్రధాని ఆరోపించారు. జేవర్ ఎయిర్ పోర్ట్ ఫైళ్లు పదేళ్ల పాటు దుమ్ము పట్టాయని, ఎన్డీయే ప్రభుత్వం వచ్చాకే ఈ కల సాకారమైందని గుర్తు చేశారు. విమానాశ్రయ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ప్రధాని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. “మీ త్యాగం వల్ల నోయిడాలో కొత్త అభివృద్ధి శకం ప్రారంభమైంది. ఇక్కడ రైతులు పండించే పంటలు, పరిశ్రమల్లో తయారయ్యే వస్తువులు ఇక నేరుగా ప్రపంచ మార్కెట్లకు చేరుతాయి” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








