చంద్రబాబు సూచన మేరకు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా లోకేశ్ ప్రమోషన్‌కు మద్దతు తెలిపారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. కాగా, లోకేశ్‌కు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్‌ను బలపర్చారు. దీంతో జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోకేశ్ ప్రమోషన్‌కు మద్దతు తెలుపుతూ ఎస్వీఎస్ఎన్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పిన వారందరికి ‘యువగళం’తో సమాధానం ఇచ్చిన నారా లోకేశ్‌కి, పార్టీ కార్యకర్తల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు.
టీడీపీ సభ్యత్వాలను కోటితో పెంచి, పార్టీని బలోపేతం చేయడంలో లోకేశ్ కీలక పాత్ర పోషించారని, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు. ఈ అభిప్రాయం కార్యకర్తల మనసులోని మాటగా ఆయన చెప్పుకొచ్చారు. ఇతరుల కంటే ప్రత్యేకంగా, పార్టీకి సేవలు చేసిన నారా లోకేశ్‌కి మరింత గుర్తింపు ఇవ్వాలని, దీనిపై సోషల్ మీడియా మరియు మీడియా ఛానళ్లలో వక్రభాష్యాలు సరికాదని కూడా వర్మ పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తలలో ధైర్యం నింపిన నారా లోకేశ్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంలో తప్పేముందన్నారు వర్మ.