విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కిరాతకంగా ప్రవర్తించాడు. బాధ్యతను మరిచి బుద్ధిలేకుండా ప్రవర్తించాడు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు, విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గొలుగొండ హైస్కూల్ బాలికలను రాష్ట్రస్థాయి క్రీడాపోటీల కోసం పీఈటీ నూకరాజు తమిళనాడు రాష్ట్రానికి తీసుకెళ్లాడు. క్రీడపోటీల కోసం తీసుకెళ్లిన బాలికలతో నూకరాజు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆటల పేరుతో విద్యార్థినులను వేధింపులకు గురిచేశాడు. ఇంటికి చేరుకున్న అనంతరం పీఈటీ నూకరాజు వికృత చేష్టలను బాలికలు తల్లిదండ్రులకు వివరించారు.
దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీని విధుల నుంచి తొలగించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలికల వెంట ఉపాధ్యాయురాలిని పంపించకుండా గెస్ట్ టీచర్ నూకరాజును పంపించిన హెడ్‌మాస్టర్ శ్రీనివాస్‌పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై విచారణ మొదలైంది.