ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో తెలంగాణ ప్రభుత్వానికి(Telangana Government) సుప్రీం కోర్టు (Supreme Court of India)లో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) పాత్రపై విచారణకు అనుమతి ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బీఆర్ఎస్(BRS) హయాంలో హరీష్‌రావు ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారి రాధా కిషన్‌రావు (Radha Kishan Rao) తన ఫోన్‌ను ట్యాప్ చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ (Chakradar Goud) పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించగా, తెలంగాణ హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినా, ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ హరీష్‌రావుపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయడం సరికాదని మరోసారి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హరీష్‌రావు పాత్రపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, బెదిరింపులకు పాల్పడ్డారంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. అయితే గతంలో ఇచ్చిన తీర్పులో జోక్యం అవసరం లేదని పేర్కొంటూ జస్టిస్ బీవీ నాగరత్న ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేశారు.
ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావును సిట్ బృందం ఇటీవల సుదీర్ఘంగా విచారించింది. దాదాపు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో బీఆర్ఎస్కు గతంలో అందిన ఎలక్టోరల్ బాండ్లు, పార్టీ నేతలతో ఉన్న ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. నవీన్‌రావు వాంగ్మూలం ఆధారంగా మరికొందరు కీలక వ్యక్తులను విచారించే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హరీష్‌రావు నవీన్‌రావుతో భేటీ కానున్నారని, విచారణ వివరాలను ఆయన నుంచి తెలుసుకోనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.








