ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన ఏపీ విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన 33 సంవత్సరాల ఫణి కుమార్ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడ కాల్గరి నగరంలో సదరన్ ఆల్బర్ట్ ఆ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేస్తున్నాడు. మిత్రులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు.
ఈనెల 14వ తేదీన ఫణికుమార్ రూమ్‌మెట్స్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి నిద్రలోనే గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. దీంతో తల్లిదండ్రులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ భరత్, కలెక్టర్‌కు విషయాన్ని తెలియజేశారు. దీంతో వారు బాధిత తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి అక్కడి అధికారులతో మాట్లాడిస్తామని చెప్పడంతో కాస్త కుదుటపడ్డారు.
ఫణి కుమార్ మృతికి గల కారణం ఏమిటో తెలియాలని, విచారణ జరిపి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తీసుకువచ్చే చర్యలు తీసుకోవాలని కోరారు.







