తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్ సభ్యుడు విజయ్ పాల్ రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ అసెంబ్లీలో గైర్హాజరు కావడం సరైనదా? అని పిటిషనర్ ప్రశ్నించారు. పిటిషన్ ప్రకారం.. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి అసెంబ్లీలో ప్రజల సమస్యలు ప్రస్తావించాలి, పోరాడాలి. కానీ అసెంబ్లీకి రాకుంటే అనర్హత విధించాల్సిందే అని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై స్పందించాలనే అంశాన్ని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు ఫార్మర్స్ ఫెడరేషన్ సభ్యుడు విజయ్ పాల్‌రెడ్డి. కేసీఆర్ స్థానంలో కొత్త నేతను ప్రతిపక్షంగా నిలిపే అవకాశం ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
న్యాయవ్యవస్థకు కీలకమైన కేసు
2023 డిసెంబరు 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఇప్పటి వరకు అసెంబ్లీకి రాలేదు అని పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజల గొంతును వినిపించేందుకు ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతలు నిర్వహించలేకపోతే, ఆ పదవి నుంచి తప్పుకోవాలి అని అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ప్రతివాదులుగా అసెంబ్లీ స్పీకర్, స్పీకర్ కార్యాలయం, కేసీఆర్, కేటీఆర్‌లను చేర్చారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది.