సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం వాహనదారులను అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన కుండపోత రహదారులను చెరువులను తలపించేలా మార్చింది. సరిగ్గా ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరే సమయానికే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో ఢిల్లీ–జైపూర్ హైవేపై దాదాపు 20 కి.మీ మేర ట్రాఫిక్ జామ్. వాహనదారులు 8 గంటలకు పైగా ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హెచ్చరికల మధ్య వర్షం దంచికొట్టింది
వాతావరణ శాఖ ముందుగానే ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడాలో భారీ వర్షం ఉంటుందని హెచ్చరించి, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 గంటల వరకు గురుగ్రామ్‌లో 100 మి.మీ.కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
మంగళవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సూచనలు ఇచ్చారు. పాఠశాలలకు కూడా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. హర్యానా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఫీల్డ్ ఆఫీసర్లను సెప్టెంబర్ 5 వరకు ప్రధాన కార్యాలయాల్లోనే ఉండాలని ఆదేశించింది. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.








