జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఇది ప్రత్యేక సభ. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ ఇది. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు, శాసనసభ్యులు, ఎంపీలు అన్నీ రకాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభను “జయకేతనం” పేరుతో గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
90 నిమిషాల స్పీచ్
పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం ఈ సభలో హైలైట్ కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో పవన్ కళ్యాణ్ 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత పార్టీ సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ప్రసంగం ఉద్దేశంగా జనసేన చెబుతోంది. అయినప్పటికీ పవన్ ప్రసంగంలో కచ్చితంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తావన, వైసీపీపై విమర్శలు ఉంటాయని తెలుస్తోంది. 90 నిమిషాల స్పీచ్‌లో హాఫ్ టైమ్ వైసీపీపై అరుపులు, కేకలకు కేటాయిస్తారని జనసైనికులే అంటున్నారు.
సభ ప్రాంగణం సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభా స్థలం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాక కోసం అర కిలోమీటర్ దూరంలో ప్రత్యేక హెలిప్యాడ్ సిద్ధం చేశారు. సభను మానిటర్ చేయడానికి కాకినాడలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వీవీఐపీ, వీఐపీల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. 250 మంది ప్రధాన వేదికపై కూర్చునే విధంగా డిజైన్ చేశారు. వాహనాల కోసం ఐదు ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా జనసైనికులు ఈ సభకు హాజరయ్యే అవకాశముంది.








