పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్ ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారం (Lifetime Achievement Award) అందించడం గర్వించదగిన విషయం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
చిరంజీవికి తమ్ముడిగా పుట్టినందుకు గర్విస్తూనే ఉంటానని పవన్ పేర్కొన్నారు. ఒక సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా ప్రారంభమైన చిరంజీవి ప్రయాణం, కేవలం స్వశక్తితో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న గొప్ప కథ అన్నారు. మెగాస్టార్ నటనలోని ప్రతిభకు గుర్తింపుగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్న చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో నటనకు పర్యాయ పదంగా నిలిచారని పేర్కొన్నారు.
తన జీవితంలో మార్గదర్శకుడిగా చిరంజీవి ఎంతో సహాయం చేశారని, అస్పష్టతలో ఉన్న సమయంలో దారి చూపిన వ్యక్తి ఆయనేనని పవన్ తెలిపారు. ఆయన ఎంతోమందికి ప్రేరణగా నిలిచారని, తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్షల మందికి రక్తదానం, నేత్రదానం వంటి సేవలు అందించారని కొనియాడారు. ఇప్పటికే భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించగా, ఇప్పుడు యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారం అందించడంపై గర్వంగా ఉందని పవన్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి మరిన్ని పురస్కారాలు అందుకుని, తమకు మార్గదర్శిగా కొనసాగాలని ఆకాంక్షించారు.
యునైటెడ్ కింగ్ డం పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య @KChiruTweets గారి కీర్తిని మరింత పెంచనుంది
— Pawan Kalyan (@PawanKalyan) March 20, 2025
సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా… pic.twitter.com/aIk6wxCk2q