టాలీవుడ్ స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) దాఖలు చేసిన కీలక పిటిషన్లపై నేడు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో విచారణ ప్రారంభమైంది. తమ అనుమతి లేకుండా పేర్లు, ఫోటోలు వాణిజ్య ప్రయోజనాల కోసం వాడటాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఈ ఇద్దరు నటులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ప్రకటనలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో తమ పేరు, ప్రతిష్ఠ, ఫోటోలను అనధికారికంగా వినియోగించడం చట్టవిరుద్ధమని పిటిషన్లలో స్పష్టం చేశారు. ఈ తరహా చర్యలు తమ ఇమేజ్ రైట్స్ (Image Rights)ను ఉల్లంఘిస్తున్నాయని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సెలబ్రిటీ హక్కులపై ..
ఈ కేసు విచారణ సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులు, ఇమేజ్ రైట్స్‌కు సంబంధించి ముఖ్యమైన న్యాయప్రాముఖ్యత సంతరించుకోనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నేటి విచారణలో కోర్టు ఇచ్చే ఆదేశాలు భవిష్యత్తులో ఇతర సినీ ప్రముఖులు కూడా ఇలాంటి అంశాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించడానికి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభమైన నేపథ్యంలో సినీ, న్యాయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఎలాంటి కీలక ఆదేశాలు జారీ చేస్తుందోనన్నది ఇప్పుడు అందరి ఆసక్తిగా మారింది.








