మహిళా దినోత్సవం రోజున ఓ లేడీ డాక్టర్ ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ప్రత్తిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) శనివారం రాత్రి జనసేన నేత అరాచకం సృష్టించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడిని కొందరు వ్యక్తులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికి విధుల్లో ఉన్న డాక్టర్ శ్వేత వెంటనే స్పందించి చికిత్సను ప్రారంభించారు. ఇదే సమయంలో కొందరు ఆసుపత్రిలోకి దూసుకొచ్చారు. తనతో ఫోన్లో మాట్లాడలేదని లేడీ డాక్టర్‌పై ప్రత్తిపాడు జనసేన ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్యబాబు ఆస్పత్రిలో వీరంగం సృష్టించాడు.
“తాను ఎవరో తెలియదా? చెప్పినట్లుగా చేయాలని తెలియదా?” అంటూ తమ్మయ్యబాబు, ఆయన అనుచరులు ఆస్పత్రిలో హంగామా సృష్టించారు. గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. అంతేకాదు, ఆసుపత్రి సిబ్బంది తీస్తున్న వీడియోలను పార్థీ కార్యకర్తలు ఫోన్లు లాక్కొని, రికార్డైన దృశ్యాలను తొలగించారు.
పవన్ ఆగ్రహం..
ప్రత్తిపాడు జనసేన ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్య వ్యవహారశైలిపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళా వైద్యురాలిపై ఆయన ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటనే దీనిపై స్పందించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ వివాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పవన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జనసేన కాకినాడ జిల్లా ఇన్చార్జ్కు కూడా పవన్ ఆదేశాలు ఇచ్చారు. తప్పు నిర్ధారణ అయినట్లయితే సంబంధిత ఇన్చార్జ్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడంతో జనసేన వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. వరుపుల తమ్మయ్య ప్రవర్తనపై పార్టీ శ్రేణుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పవన్ కల్యాణ్ ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని, పార్టీ క్రమశిక్షణపై తన నిబద్ధతను మరోసారి చాటిచెప్పారు.








