ప్రచారానికి పవన్ కళ్యాణ్ అవసరమేనా? వద్దా?… బీజేపీలో డైలమా

ప్రచారానికి పవన్ కళ్యాణ్ అవసరమేనా? వద్దా?… బీజేపీలో డైలమా

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన–బీజేపీ పొత్తు వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు, తెలంగాణలో మాత్రం ఒకే బరిలో నిలబడటం కమలదళానికి కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బీజేపీ టికెట్లు ఆశించి భంగపడ్డ పలువురు నేతలు జనసేనలో చేరి, అక్కడి నుంచి బరిలోకి దిగడం కాషాయ పార్టీకి ఇబ్బందిగా మారింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో, క్షేత్రస్థాయిలో బీజేపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన పెరుగుతోంది.

ఇక ప్రచారం విషయానికి వస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన బీజేపీ, ప్రచారానికి మాత్రం పవన్ కళ్యాణ్ మద్దతును కోరడం విశేషంగా మారింది. అయితే జనసేన కూడా పలు కీలక స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడంతో రెండు పార్టీల మధ్య నేరుగా పోటీ నెలకొంది. జనసేన మొత్తం దాదాపు 345 స్థానాల్లో బరిలో ఉండగా, బీజేపీ సైతం అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓట్లు చీలిపోవడం వల్ల కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు లాభం చేకూరుతుందనే భయం బీజేపీలోని ఒక వర్గాన్ని కలవరపెడుతోంది.

ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు ‘తెలంగాణ సెంటిమెంట్’ను తెరపైకి తీసుకొచ్చి బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏపీకి చెందిన నేత అయిన పవన్ కళ్యాణ్ మద్దతు కోరడమే బీజేపీకి ఇబ్బందిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈనెల 7, 8 తేదీల్లో పవన్ ప్రచారం చేయనున్నప్పటికీ, జనసేన–బీజేపీ ఇద్దరూ బరిలో ఉన్న చోట్ల ఆయన ఎవరి తరపున ప్రచారం చేస్తారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో మిత్రధర్మం పాటించాలా? పార్టీ ప్రయోజనాలు కాపాడాలా? అనే డైలమాలో ఇరు పార్టీలు చిక్కుకున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment