రాష్ట్రంలో అవినీతి (Corruption) పూర్తిగా వ్యవస్థీకృతంగా మారిపోయిందని, అవినీతి లేని (Corruption-Free) రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ప్రజాపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. మంగళగిరిలో (Mangalagiri) పోలీస్ కానిస్టేబుళ్ల (Police Constables) నియామక పత్రాల (Appointment Letters) అందజేత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కు సంబంధించి 2022లో వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని అంగీకరించిన పవన్.. నియామకాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేసినా అప్పటి ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆ కేసులను తాము క్లియర్ చేశామని చెప్పడం గమనార్హం. అయితే గతంలో వైసీపీ ఇచ్చిన కానిస్టేబుళ్ల నియామకానికి వ్యతిరేకంగా కేసులు వేసింది ఈ కూటమికి చెందిన నాయకులే అనే ఆరోపణలు ఉన్నాయి. వారేసిన కేసులను, వారే ఉపసంహరించుకొని రిక్రూట్‌మెంట్ తామే నియమించామని చెప్పుకుంటున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అలాగే రాజకీయ నాయకులు పోలీసులను బెదిరించే ధోరణి ఇకపై సహించబోమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. “మేము వస్తామని వైఎస్ జగన్(YS Jagan) పోలీసులను హెచ్చరిస్తున్నారు. ఇలాంటి రాజకీయ సంస్కృతి మారాలి. ఏ రాజకీయ నాయకుడైనా పోలీసులను బెదిరిస్తే కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు. చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి స్టేట్‌మెంట్‌ను మేము జాగ్రత్తగా గమనిస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.







