హ‌ద్దు మీరిన అభిమానం.. పోలీసుల లాఠీచార్జ్‌!

అభిమానం శృతిమించిపోయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) కొత్త సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (Harihara Veeramallu) విడుద‌ల సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న అభిమానులు విధ్వంసం సృష్టించారు. నిన్న సాయంత్రం వ‌ర‌కు ప్ర‌శాంతంగా రాష్ట్ర ప్ర‌జ‌లు ఫ్యాన్స్ (Fans) చేసిన అల‌జ‌డితో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. బైకుల (Bikes) సైలెన్సర్లు (Silencers) తీసి భ‌రించ‌లేని యాక్సిల‌రేట‌ర్ శ‌బ్దాలు, రోడ్ల‌పై భ‌యం క‌లిగించేలా స్టంట్లు, ఓవ‌ర్ స్పీడ్‌తో డ్రైవింగ్‌, కూడ‌ళ్ల‌లో బాంబుల సౌండ్స్‌.. వీట‌న్నింటికీ మించి రోడ్ల‌పై ఫ్యాన్స్ చేసిన హంగామాతో జ‌నం భ‌య‌భ్రాంతులకు గురయ్యారు. ప‌లుచోట్ల శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. సినిమాల పేరుతో ఇలాంటి వీరంగం, విధ్వంసాలు సృష్టించ‌డంపై రాష్ట్రంలో ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా విడుదల సందర్భంగా బుధవారం రాత్రి 9:30 గంటలకు ప్రీమియర్స్ షో (Premiere Shows)లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు రాష్ట్రంలోని పలుచోట్ల తీవ్ర అల్లర్లు సృష్టించారు.

త‌ణుకులో వైసీపీ ప్ర‌చార ర‌థంపై ఎక్కి హంగామా
తణుకు (Tanuku)లో జనసేన (Janasena) కార్యకర్తల (Cadres) వీరంగం సృష్టించారు. వైసీపీ నేత‌ (YSRCP Leader), మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు (Karumuri Nageswara Rao) వాహనాన్ని ప‌వ‌న్ అభిమానులు అడ్డుకొని నానా యాగీ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా త‌ణుకులో బైక్‌ ర్యాలీ నిర్వ‌హించిన ప‌వ‌న్ ఫ్యాన్స్‌.. మాజీ మంత్రి కారుమూరి వాహనాలు వెళ్తుండగా అడ్డుకుని హడావుడి చేశారు. వైసీపీ ప్రచార రథంపైకి ఎక్కి హల్‌చల్ చేశారు.

మచిలీపట్నం రేవతి థియేటర్‌ వద్ద
మచిలీపట్నంలోని రేవతి థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి థియేటర్ వద్ద పెద్ద ఎత్తున రచ్చరచ్చ చేసి, ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ప్రీమియర్ షో కోసం పరిమితికి మించి అభిమానులు థియేటర్‌కు రావడంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్‌లోకి చొచ్చుకురావడంతో థియేటర్ అద్దం ధ్వంసమైంది. అంతటితో ఆగకుండా, అభిమానులు ఒకరిపై మరొకరు వాటర్ క్యాన్లతో దాడి చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కడప రాజా థియేటర్‌ వద్ద కర్రలతో దాడి
ఇక, కడప నగరంలోని రాజా థియేటర్ వద్ద కూడా పవన్ అభిమానులు హంగామా సృష్టించారు. బైక్ సౌండ్స్‌తో రచ్చరచ్చ చేశారు. బైకుల సైలెన్సర్లు తీసి నగరంలో బైక్ రైడింగ్‌తో హంగామా సృష్టించారు. ఈ క్రమంలో రెండు వర్గాలుగా విడిపోయిన అభిమానులు కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. పోలీసులు సర్దిచెప్పినా పవన్ అభిమానులు వినకపోవడంతో థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

సంధ్య థియేటర్‌ వద్ద భారీ బందోబస్తు
మరోవైపు, హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. థియేటర్ ముందు హంగామా చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టికెట్లు ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి అనుమతిస్తున్నారు. థియేటర్ లోపల కూడా పోలీసులు ఎలాంటి అవాంతరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment