తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరుగుతున్న బస్సు ప్రమాదాలను ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ తరువాత చేవెళ్ల బస్సు ప్రమాదం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ రెండు ప్రమాదాలు మరిచిపోకముందే తాజాగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
హైవే-65 పై మళ్లీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటనలో పెను ప్రమాదం తప్పింది. చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద వెళ్తున్న విహారి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టేశాయి. అయితే అదృష్టవశాత్తూ ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రాణనష్టం తప్పింది.
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు బయలుదేరిన ఈ బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఒక్కసారిగా మంటలు రావడంతో డ్రైవర్ ఆపక ముందే ప్రయాణికులు కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. కొన్ని నిమిషాల్లోనే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.
ఈ బస్సు నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌కి చెందినదిగా తేలింది. ఫిట్‌నెస్ లేకపోయినా, సీటింగ్ అనుమతులు మాత్రమే తీసుకుని వాటిని స్లీపర్ కోచ్‌గా మార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ బస్సుపై ఇప్పటికే ఐదు చలాన్లు నమోదైనట్టు సమాచారం. అయినప్పటికీ, యాజమాన్యం నిబంధనలను పట్టించుకోకుండా ప్రయాణికులను తరలించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల కర్నూలులో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదం తర్వాత రెండు రోజులు మాత్రమే అధికారులు హడావుడి చేసినా, ఆ తరువాత మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలపై రవాణాశాఖ, పోలీసు విభాగం సీరియస్‌గా స్పందించాలన్న డిమాండ్ పెరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.








