అప్పు చేసి రూ.3 లక్షల బైక్ కొన్న తల్లిదండ్రుల.. కొడుకు మృతి

కొడుకు కి 3 లక్షలు అప్పు చేసి బైక్ కొన్న తల్లిదండ్రుల.. కొడుకు మృతి

తమ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే, తమ పిల్లల జీవితాలు సాఫీగా సాగాలని, వాళ్లకు అన్ని సౌకర్యాలు ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. అలా ఆలోచించిన తల్లిదండ్రులు తమ కుమారుడి సంతోషం కోసం మూడు లక్షల రూపాయల అప్పు చేసి బైక్ కొనిచ్చారు. కొడుకు ముఖంలో సంతోషం చూడాలనుకున్న ఆ పేద తల్లిదండ్రులకు.. ఇప్పుడు ఆ బిడ్డే దూరమై తీరని కడుపుకోత మిగిల్చాడు.

విశాఖపట్నం (Visakhapatnam), మహారాణిపేట (Maharani Peta)కు చెందిన శ్రీనివాసరావు (Srinivasa Rao) (ఆటో డ్రైవర్) దంపతులకు వారి కుమారుడు హరీష్ (19) అంటే పంచప్రాణాలు. ఇంటర్ వరకు చదివిన హరీష్ ఇటీవల బైక్(Bike) కావాలని మారం చేశాడు. కొడుకు కోరిక తీర్చే స్థోమత లేకపోయినా, అతడు పట్టిన మొండి పట్టుకు ఆ తల్లిదండ్రులు కష్టాలు పడి, చివరికి ఏకంగా 3 లక్షల రూపాయల అప్పు చేసి మరీ, ఆ ముద్దుల కొడుకు కోసం దసరా పండుగ రోజున కొత్త బైక్ కొనిచ్చారు. అప్పు (Loan)  చేసి కొడుకు ఆశ తీర్చినందుకు ఆ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు.

కొత్త బైక్.. కాసేపటికే తీరని విషాదం

కొత్తగా బైక్ రావడంతో సంతోషంగా ఉన్న హరీష్, తన స్నేహితుడు వినయ్‌తో కలిసి ఆ బైక్‌పై ద్వారకానగర్ వైపు వెళ్లాడు. టిఫిన్ చేశాక, స్నేహితుడిని ఇంటి వద్ద దించడానికి బయలుదేరాడు. కొత్త బైక్, ఆ ఉత్సాహం.. అన్నీ కలిసి హరీష్‌ను అతివేగానికి పురికొల్పాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న బైక్.. సిరిపురం దత్ ఐలాండ్ మలుపు వద్ద అదుపు తప్పింది. వేగాన్ని నియంత్రించలేక బైక్ ఒక్కసారిగా డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ భయంకర ప్రమాదంలో హరీష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్నేహితుడు వినయ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హరీష్‌ను హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ.. కొద్దిసేపటికే ఆ యువకుడు కన్నుమూశాడు.

తన కొడుకు కల నెరవేర్చాలని అప్పుల పాలైన ఆ తల్లిదండ్రులు, ఇప్పుడు ఆ బిడ్డ మరణంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. జీవితాంతం అప్పులు తీరుస్తూ, బిడ్డ జ్ఞాపకాలను మోయాల్సిన కడుపుకోత వారికి మిగిలింది. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment