తెలంగాణ (Telangana)లో ఫేషియల్ రికగ్నిషన్ యాప్ (Facial Recognition App)ను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగుల (government) హాజరును పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో… జగిత్యాల జిల్లా (Jagityal District)లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. విధులకు హాజరు కాకుండానే పంచాయతీ కార్యదర్శి ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో(Photo)ను అప్లోడ్ చేసి యాప్‌లో అటెండెన్స్ (Attendance) వేసినట్లు తేలింది. ఈ వ్యవహారం బయటపడటంతో అధికారులు షాక్‌కు గురయ్యారు.
పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజు విధులు నిర్వహిస్తున్న గ్రామాల నుంచే మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే కొంత మంది ఉద్యోగులు ప్రతిరోజూ ఒకే ఫోటోను అప్లోడ్ చేయడంతో అనుమానించిన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. విచారణలో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి.
కొంత మంది ఉద్యోగులు విధులకు రాకుండానే ఇతరుల సహాయంతో అటెండెన్స్ వేయడం, ఖాళీ కుర్చీల ఫోటోలు పెట్టడం వంటి చర్యలు అధికారుల నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. ఇటువంటి నిర్వాకాలపై ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థను మరింత పటిష్టంగా చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అధికారులు ప్రస్తుతం ఘటనపై పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేస్తున్నారు.







