‘ప‌ల్లె క‌న్నీరు పెడుతోంది’.. కొలికపూడి మరో సంచలన పోస్ట్

ప‌ల్లె క‌న్నీరు పెడుతోంది.. కొలికపూడి మరో సంచలన పోస్ట్

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి సంచలనానికి కేంద్రబిందువుగా మారారు. గతంలో పార్టీ టికెట్ వ్యవహారంలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నీపై తీవ్ర ఆరోపణలు చేసి, బ్యాంక్ స్టేట్‌మెంట్లతో సహా బహిర్గతం చేసిన కొలికపూడి, ఆ తరువాత కూడా ఎంపీపై గంజాయి, పేకాట, ఉద్యోగాల పేరుతో కన్సల్టెన్సీ దందాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో టీడీపీలో తీవ్ర కలకలం రేపింది.

తాజాగా, తిరువూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై కొలికపూడి చేసిన వాట్సాప్ స్టేటస్ మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల పాటు 35 గ్రామాల్లో తిరుగుతూ 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలను తన సందేశంలో ప్రస్తావించారు.

“రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతోంది” అంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పోస్టు టిడిపి పాలనపై పరోక్ష విమర్శగా ఉందని పలువురు భావిస్తున్నారు. ప్రజల కష్టాలను బయటపెట్టడం ద్వారా సొంత పార్టీ పాలన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారా? అనే ప్రశ్నలు టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.

ప్రజల సమస్యలను నేరుగా ప్రస్తావిస్తూ, నియోజకవర్గంలోని వాస్తవ పరిస్థితులను బయటపెట్టిన కొలికపూడి చర్యను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది పార్టీకి ఇబ్బంది కలిగించే పోస్ట్‌గా అభివర్ణిస్తున్నారు. పరోక్షంగా సొంత పార్టీనే లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది.

ఏదేమైనా, తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ కొలికపూడి శ్రీనివాస్ మరోసారి రాజకీయ చర్చకు దారి తీశారు. ఈ పోస్టుపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment