మావోయిస్టులపై (Maoists) ఆపరేషన్ కగార్ (Operation Kagar) వేగం పెరిగింది. హిడ్మా (Hidma) ఎన్‌కౌంటర్ (Encounter) వ్యవహారంపై కీలక విషయాలు వెలుగులోకి రావడంతో భద్రతా వర్గాల్లో ఉత్కంఠ చెలరేగింది. దేశం దాటి శ్రీలంక (Sri Lanka)కు పయనం కావాలని ప్రయత్నించిన అగ్ర మావోయిస్టు నాయకులపై పక్కా సమాచారం రావడంతో బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలోనే హిడ్మా నుంచి బయటకు వచ్చిన లేఖ మరింత సంచలనంగా మారింది.
బస్తర్ (Bastar)లోని ఒక జర్నలిస్టుకు నవంబర్ 10న పంపిన లేఖలో హిడ్మా, తన ఆలోచనలు, భవిష్యత్ నిర్ణయాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయుధాలు విడిచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించాడు. “లొంగిపోవడం కోసం సరైన వేదికను నిర్ణయించుకోవాలి. మా భద్రతకు హామీ ఇస్తే సరెండర్‌కు సిద్ధమవుతాం” అని స్పష్టంగా పేర్కొన్నాడు. త్వరలో హిందీతో పాటు తెలుగు భాషల్లోనూ ఆడియో సందేశం విడుదల చేస్తానని లేఖలో వెల్లడించాడు. లొంగుబాటు ముందు కొన్ని కీలక అంశాలపై చర్చ జరగాల్సి ఉందని కూడా హిడ్మా తెలిపాడు. త్వరలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తనను కలవాలని సదరు జర్నలిస్టుకు సూచించినట్లు సమాచారం.
ఇంటెలిజెన్స్ చీఫ్ వివరణ
ఫేక్ ఎన్‌కౌంటర్ జరిగిందనే ఆరోపణలపై ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా స్పందించారు. హిడ్మాను పట్టుకుని ఎన్‌కౌంటర్ చేశారన్న ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారమని ఆయన స్పష్టం చేశారు. “లొంగిపోవడానికి వచ్చే ఏ వ్యక్తినీ ఎన్‌కౌంటర్ చేసిన ఉదాహరణ లేదు. ఎవరైనా భయపడితే మీడియా ద్వారా వచ్చి కూడా సరెండర్ కావచ్చు” అని ఆయన చెప్పారు. హిడ్మా లేఖ రాసిన విషయం తమకు తెలియదని కూడా లడ్డా పేర్కొన్నారు.
హిడ్మా లేఖ బయటపడటం, మరోవైపు బలగాలు చేపట్టిన భారీ ఆపరేషన్, రెండు కలిసి ఆ ప్రాంతంలో పరిస్థితులను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. శ్రీలంకకు పారిపోవాలని ఉన్న మావోయిస్టుల ప్రణాళిక విఫలమవ్వడంతో వారు గందరగోళంలో ఉన్నారని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక హిడ్మా నిజంగా సరెండర్ దిశగా అడుగులు వేస్తాడా? లేఖలో పేర్కొన్న అంశాలు నిజమేనా? అనే విషయంపై అధికార సంస్థలు దృష్టి సారించాయి.








