గాలి జ‌నార్ద‌న్‌రెడ్డిపై హ‌త్యాయ‌త్నం, ఒకరు మృతి.. (Videos)

గాలి జ‌నార్ద‌న్‌రెడ్డిపై హ‌త్యాయ‌త్నం, ఒకరు మృతి.. బ‌ళ్లారిలో ఉద్రిక్త‌త‌ (Videos)

కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం రాజకీయంగా సంచలనం రేపుతోంది. వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో వివాదం చెలరేగి, అది క్రమంగా హింసాత్మక ఘటనకు దారితీసింది. ఈ ఘటనలో బళ్లారి అధికార‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి టార్గెట్‌గా కాల్పులు జ‌ర‌ప‌డంతో మరింత ఉద్రిక్తంగా మారింది.

సమాచారం ప్రకారం, కాంగ్రెస్ కార్యకర్త సతీష్ రెడ్డి ఎమ్మెల్యే గన్‌మన్ తుపాకీని లాక్కొని రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందగా, సతీష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో గాలి జనార్ధన్ రెడ్డి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. ఘటన అనంతరం పోలీసులు రంగంలోకి దిగారు. కాల్పుల దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఈ ఘటనపై గాలి జనార్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనను హత్య చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారని ఆయన మీడియా ముందు బుల్లెట్స్ చూపిస్తూ ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ఈ ఆరోపణలను భరత్ రెడ్డి ఖండిస్తూ, గాలి జనార్ధన్ రెడ్డిని చంపాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. మరోవైపు రాజశేఖర్ మృతి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రూస్‌పేట పోలీస్ స్టేషన్‌లో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా మొత్తం 11 మందిపై కేసులు నమోదయ్యాయి. బళ్లారిలో ప్రస్తుతం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతకు దారి తీస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment