ప‌వ‌నా.. నీకిది త‌గునా..?

ర‌ప్పా ర‌ప్పా అంటే కేసు.. మ‌రి ప‌వ‌న్ ఏకంగా క‌త్తి ప‌డితే..?

హైదరాబాద్ వేదికగా జరిగిన ‘ఓజీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రవర్తనపై త‌లెత్తుతున్న విమ‌ర్శ‌లు తీవ్ర వివాదంగా మారుతున్నాయి. సినిమా ఈవెంట్‌లో ఆయన కత్తి పట్టుకొని వేదికపై అటూ ఇటూ తిరిగిన తీరు, తాను ఎత్తిన క‌త్తిని అభిమానులకు చూపించేలా సెక్యూరిటీని పక్కకు జరిపించిన వీడియోలు, క‌త్తి తిప్పుతూ సెక్యూరిటీని భ‌య‌పెట్టిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

సినిమా హీరోలాగే రావొచ్చుగా..?
ఈవెంట్‌లో వర్షం పడుతుండగా సెక్యూరిటీకి గొడుగు పట్టమని ఆదేశించడం, కత్తి ఎత్తి ఏదో సాధించిన‌ట్లుగా ప్ర‌ద‌ర్శించే హావభావాలు చూసి ప్ర‌జ‌లంతా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. యువ‌త‌ను ప్ర‌భావితం చేసే వ్య‌క్తిగా, నాలుగు కీలక శాఖలకు బాధ్య‌త గ‌ల‌ మంత్రిగా, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం ప్రజలను తీవ్ర విస్మ‌యానికి గురిచేసింద‌ని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్టేజీ మీద కత్తి పట్టుకుని అలా తిరుగుతూ యువ‌కుల‌కు ఎలాంటి సందేశం ఇస్తున్న‌ట్లుగా అని మేధావులు, రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం ప్ర‌శ్నిస్తున్నారు. అది సినిమా ఫంక్ష‌న్ అలాగే ఉంటుంద‌ని కొంద‌రు ప‌వ‌న్ ఫ్యాన్స్ స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, సినిమా ఫంక్ష‌న్‌కు ప్ర‌భుత్వ సెక్యూరిటీ ఎందుకు..? ఏ హోదా లేకుండా సినిమా హీరో గానే ఫంక్ష‌న్‌కు హాజ‌ర‌వ్వొచ్చుగా..? గొడుగు ప‌ట్టుకోమ‌ని చెబుతూ.. క‌త్తి తిప్పుతూ సెక్యూరిటీని భ‌య‌పెట్ట‌డం దేనికి..? అని కొంద‌రు లాజిక్‌తో ప్ర‌శ్నిస్తున్నారు.

ఇది మ‌న మీడియా తీరు.. ఆహా-ఓహో
అయితే, మరోవైపు కొందరు నెటిజన్లు మీడియా వైఖరిని ప్రశ్నిస్తున్నారు. ఒక కార్యకర్త సినిమా డైలాగులు రాసిన బ్యానర్ పెట్టినా పెద్ద ఎత్తున చర్చలు నిర్వహించే మీడియా, డిప్యూటీ సీఎం వేదికపై కత్తి పట్టుకున్నా ‘ఆహా-ఓహో’ అంటూ ప్రశంసించడం ద్వంద్వ వైఖరని అంటున్నారు. ర‌ప్పా.. ర‌ప్పా అని సినిమా డైలాగ్‌ను పోస్ట‌ర్‌గా ప్ర‌ద‌ర్శిస్తేనే కేసులు పెట్టారే.. మ‌రి ఒక డిప్యూటీ సీఎం క‌త్తి ప‌ట్టుకుంటే ఆకాశానికి ఎత్తుతున్నారే.. “ఇదిరా మీడియా సత్తా, మీడియాను తక్కువగా అంచనా వేయొద్దు” అంటూ మీడియా ప‌నితీరును ప్ర‌శ్నిస్తూ నెటిజ‌న్లు వ్యంగ్యంగా పెడుతున్న‌ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment